: రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలకు కేంద్ర కేబినెట్ అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఢిల్లీలో నిన్న రాత్రి ప్రధాని నివాసంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీమాంధ్రకు 5 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కల్పించే నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రణాళికా సంఘాన్ని కోరింది. సీమాంధ్ర నేతలు 15 ఏళ్లపాటు అయినా ప్రత్యేక హోదా కల్పించాలని కోరగా.. కేబినెట్ 5ఏళ్లతో సరిపెట్టడం ఆ ప్రాంత వాసులను నిరాశపరిచేదే.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ముంపునకు గురయ్యే ప్రాంతాలున్న అన్ని మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు కేబినెట్ నిర్ణయించింది. ముంపు గ్రామాలున్న మండలాలను సీమాంధ్రలో కలపడం వల్ల.. భూములు కోల్పోయే వారికి అదే మండలంలో పునరావాసం కల్పించడం వీలువుతుందనే ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఖమ్మం జిల్లాలోని పాల్వంచ రెవెన్యూ డివిజన్‌లో కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు.. భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం మండలాలు (భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా) సీమాంధ్రకు వెళతాయి. ఇలా చేస్తే భద్రాచలం పట్టణానికి అనుసంధానం తెగిపోతుందని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో భద్రాచలం పట్టణంతోపాటు.. దారికి వీలుగా బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని నిర్ణయించారు. పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇలవెండి, మోతేపట్టినగర్, ఉప్పుశాక, నకిరీపేట, సోంపల్లి గ్రామాలు తెలంగాణలోనే ఉంటాయి.
ఇక ప్రస్తుతం రాష్ట్రంలో రామగుండంలో(2,100 మెగావాట్లు), విశాఖపట్టణంలో(2,000 మెగావాట్లు) ఎన్టీపీసీ విద్యుత్ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో 15 శాతం వాటాను కేంద్రం ప్రభుత్వం అత్యవసరాల కోసం తన పరిధిలో ఉంచుకుంటోంది. అయితే, రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాక ఈ 15 శాతం వాటాను కూడా సీమాంధ్ర, తెలంగాణకు కేటాయిస్తారు. మిగిలిన 85 శాతాన్ని గాడ్గిల్ ఫార్ములా ఆధారంగా ఇరు రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. ఏ ప్రాంతానికి ఎంతన్నది అంచనా వేయాల్సి ఉంది. ఈ నిర్ణయాలపై ఆర్డినెన్స్ ల జారీకి కేంద్ర కేబినెట్ సాహసించలేదు. రానున్న ప్రభుత్వమే ఆర్డినెన్స్ లను తీసుకురావాలని పేర్కొంది.
సీమాంధ్రలో రాజధాని ప్రాంతాన్ని తేల్చడానికి రెండు మూడు రోజుల్లో కమిటీ వేస్తామని కేబినెట్ సమావేశం అనంతరం జైరాం రమేశ్ మీడియాకు చెప్పారు. త్వరలోనే అపాయింటెడ్ డేపై ప్రకటన ఉంటుందన్నారు.