: మళ్లీ భారత కుబేర స్థానం ముకేశుడిదే
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ మరోసారి భారత కుబేర స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈయనకు 1800 కోట్ల డాలర్ల (1,11,600 కోట్ల రూపాయలు) ఆస్తులు ఉన్నట్లు చైనాకు చెందిన పరిశోధనా సంస్థ హరూన్ అంచనా వేసింది. ఈ మేరకు హరూన్ 2014 ఏడాదికి సంబంధించి ప్రపంచ సంపన్నుల జాబితాను విడుదల చేసింది.
ప్రపంచ బిలియనీర్ల జాబితాలో ముకేశ్ అంబానీ 41వ స్థానంలో ఉండగా.. భారత సంతతికి చెందిన బ్రిటన్ వ్యాపారవేత్త లక్ష్మీనివాస్ మిట్టల్ 1700కోట్ల డాలర్ల ఆస్తులతో జాబితాలో 49వ స్థానంలో ఉన్నారు. సన్ ఫార్మాకు చెందిన దిలీప్ సింఘ్వి, విప్రో అజీం ప్రేమ్ జీ చెరో 1,350 కోట్ల డాలర్ల సంపదతో 77వ స్థానంలో నిలిచారు. టాటాసన్స్ కు చెందిన పల్లోంజి మిస్త్రీ (1,200కోట్ల డాలర్లు), ఎస్పీ హిందుజా, ఆయన కుటుంబం (1,200కోట్ల డాలర్ల సంపదతో) 93వ స్థానంలో ఉన్నారు.
ఇక ప్రపంచ కుబేరుడిగా జాబితాలో మొదటి స్థానంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఉన్నారు. గేట్స్ కు 6,800 కోట్ల డాలర్ల (రూ. 4.21లక్షల కోట్లు) ఆస్తులు ఉన్నాయని హరూన్ పేర్కొంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ రెండో స్థానంలో ఉన్నారు. ఈయన ఆస్తుల విలువ 6,400కోట్ల డాలర్లుగా ఉంది.