: రేపు ప్రజల మధ్యకు రానున్న పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ తొలిసారిగా ఓ సామాజిక కార్యక్రమం కోసం ప్రజల్లోకి రానున్నారు. మంచి పని కోసం ప్రజలతో కలసి నడవడానికి పవన్ సిద్ధమయ్యారు. ప్రజాహిత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో కొత్తగా స్థాపించిన హృదయ స్పందన ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న ఓ వాక్ లో పవన్ కల్యాణ్ నడవబోతున్నారు. పవన్ కల్యాణ్ తో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా పాల్గొననున్నారు. ‘వాక్ ఫర్ హార్ట్ రీచ్ ఫర్ ఎ హార్ట్’ పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని శ్రేయాస్ మీడియా వారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉంది. ఆదివారం ఉదయం 6 గంటలకు హైదరాబాదులోని నెక్లస్ రోడ్ వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ, డాక్టర్ గురవారెడ్డి తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.