: నిద్రించే ముందూ ఫేస్ బుక్ స్మరణే
రోజంతా అలసి సొలసిన వారు అలా పడక మంచం ఎక్కగానే.. ఓ మంచి పుస్తకం చదవాలని నిపుణులు సూచిస్తుంటారు. దానివల్ల మనసు ప్రశాంతంగా మారి నిద్ర మంచిగా పడుతుందని అలా చెబుతారు. కొంత మంది దాన్ని తప్పక ఫాలో అవుతుంటారు. కానీ, ఫేస్ బుక్ లాంటివి వచ్చాక ఇలాంటి మంచి అలవాటును పాటించే వారు తగ్గుతున్నారు. నిద్రించే ముందు ఫేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్లు చూడడం, టీవీలు చూడడం పెరిగిపోయిందని న్యూకేజిల్ కు చెందిన మెమొరీ ఫోమ్ కంపెనీ ఎర్గో ఫ్లెక్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
బ్రిటన్ లో 2,500 మంది దినచర్యను పరిశీలించగా ఈ విషయాలు తెలిశాయి. మూడొంతుల మంది పడుకునే ముందు అర్ధగంటైనా ట్విట్టర్, ఫేస్ బుక్ చూస్తున్నామని చెప్పారు. సగం మందికిపైగా టీవీలో కార్యక్రమాలను వీక్షిస్తున్నామని తెలిపారు. వీరు సగటున 17 నిమిషాల పాటు టీవీ చూస్తున్నారట.