: టీజేఏసీ రాజకీయ పార్టీగా మారదు: కోదండరాం
తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (టీ జేఏసీ) రాజకీయ పార్టీగా మారదని కన్వీనర్ కోదండరాం స్పష్టం చేశారు. స్వభావరీత్యా ఏ ప్రజా సంఘమూ రాజకీయ పార్టీగా మారడానికి సాధ్యం కాదని చెప్పారు. ప్రజా సంఘాలు వాటిలో సభ్యులుగా ఉంటాయని... ఉద్యమ సంస్థలు ప్రజలకు, పార్టీలకు మధ్య వారధిగా ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన వారికి రాజకీయ పార్టీలు అవకాశం కల్పించాలన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీ పట్ల సమాజంలో, ప్రజలకు సానుభూతి ఉందని, జేఏసీ తరపున విజయోత్సవాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కాగా, ఒకటి రెండు రోజుల్లో తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కోదండరాం తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణం, విధివిధానాలపై మరోసారి సమావేశమై చర్చిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం అపాయింటెడ్ డేను ప్రకటించాలని కోరారు. జేఏసీ నేతల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కోదండరాం.. వచ్చే ఎన్నికలు రెండు రాష్ట్రాల్లో జరగాలని తెలంగాణ జేఏసీ కోరుతోందన్నారు.