: ఎమ్మెల్యేతో జూడాల జగడం
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యేకు, జూనియర్ డాక్టర్లకు మధ్య చెలరేగిన వివాదం హింసాత్మక రూపు దాల్చింది. గణేశ్ శంకర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన జూనియర్ డాక్టర్లు చికిత్స కోసం వచ్చిన ఓ వ్యక్తి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారన్న విషయమై ఆర్యా నగర్ శాసనసభ్యుడు ఇర్ఫాన్ సోలంకి ప్రశ్నించేందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు జూడాలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడేమీ హింస చోటుచేసుకోకున్నా, ఎమ్మెల్యే తన వాహనానికి పెట్రోల్ కొట్టిస్తుండగా, జూడాలు రాళ్ళతో దాడి చేశారు. ఈ దాడిలో సోలంకి తలకు గాయమైంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని జూడాలపై విరుచుకుపడ్డారు. దీంతో, జూనియర్ డాక్టర్లకు కూడా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 36 మంది జూడాలను అరెస్టు చేశారు.