: మనకూ ఓ అసాంజే ఉన్నాడు!
జూలియన్ అసాంజే, వికీలీక్స్... ఈ రెండు పేర్లను విడదీయలేం. వికీలీక్స్ వెబ్ మాగజైన్ ద్వారా అగ్రరాజ్యం అమెరికాతో సహా పలు దేశాల రహస్యాలను బట్టబయలు చేసిన అసాంజే కొందరికి హీరో. సరిగ్గా అలాంటి వ్యక్తే భారత్ లోనూ ఉన్నాడు. తమిళనాడుకు చెందిన ఆచ్చిముత్తు శంకర్ కూడా ఓ వెబ్ సైట్ పెట్టి దాని ద్వారా ప్రభుత్వానికి చెందిన కీలక సమాచారాన్ని బట్టబయలు చేస్తున్నాడు. అతని వెబ్ సైట్ పేరు 'సవుక్కు.నెట్'. ఇటీవలే శంకర్ బాధితులు చేసిన ఫిర్యాదు మేరకు ఈ సైట్ ను పోలీసులు బ్లాక్ చేశారు.
కొన్నాళ్ళక్రితం శంకర్ ఓ సాధారణ ప్రభుత్వోద్యోగి. రాష్ట్ర విజిలెన్స్, యాంటీ కరప్షన్ విభాగంలో పనిచేశాడు. ఇతను ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ కు వీరాభిమాని. 2008లో సమాచారాన్ని అనుమతి లేకుండా పత్రికలకు చేరవేశాడని విధుల నుంచి తొలగించారు. ఆ తర్వాత శంకర్ పూర్తిస్థాయిలో సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడిగా అవతారమెత్తాడు. అనంతరం ఓ బ్లాగ్ ప్రారంభించి ప్రభుత్వాన్ని ఏకిపారేస్తూ ఓ వ్యాసం రాశాడు. ఆ మరుసటి రోజే అతనిని అరెస్టు చేసిన పోలీసులు తమదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు.
కానీ, శంకర్ మొండిపట్టుదలతో తన బ్లాగ్ ను వెబ్ సైట్ గా మార్చి తన విశ్వరూపాన్ని ప్రదర్శించసాగాడు. తమిళనాడు ప్రభుత్వాధికారులు ఈ సైట్ ను పిచ్చోడి చేతిలో రాయిగా అభివర్ణిస్తుంటారు. శంకర్ కు ఫేస్ బుక్ లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లో అతనికి 5000 మంది ఫాలోయర్లు ఉన్నారు. పోస్ట్ పెడితే వందల కొద్దీ లైక్స్ పడాల్సిందే.
ఇటీవలే సన్ టీవీ ఉద్యోగి ఒకరు ఇతనిపై క్రిమినల్ కేసు దాఖలు చేశారు. దీనిపై చెన్నైలోని ఓ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయగా, తమిళనాట జర్నలిస్టు సంఘాలు శంకర్ ను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం జయలలితను కోరాయి. ఇంతకీ 'సవుక్కు' అంటే కొరడా అని అర్థం అట!