: బిడ్డ పుడుతుండగానే తల్లిని చంపారు: విభజనపై మోడీ వ్యాఖ్య
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. విభజించు పాలించు రాజకీయాలతో దేశాన్ని ఏలుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నట్టుందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా ఆ పార్టీ సీమాంధ్ర విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని విమర్శించారు. కర్ణాటకలోని గుల్బర్గా వద్ద సభలో మాట్లాడుతూ, 'మేము తెలంగాణ కావాలన్నాం, అదే సమయంలో సీమాంధ్రలో అభివృద్ధినీ కాంక్షించాం. కానీ, బిడ్డ పుడుతుండగానే తల్లిని చంపేశారు' అని కాంగ్రెస్ పెద్దలను దుయ్యబట్టారు. త్వరలోనే తాను సీమాంధ్రలో పర్యటిస్తానన్న మోడీ, అక్కడి ప్రజల మనోగాయాలకు ఉపశాంతి కలిగించే ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీపైనా తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ 'దస్ నంబరీ గాంధీలు' అని అభివర్ణించారు (హిందీలో '10' నెంబర్ ను మోసగాళ్ళను సూచించడానికి వాడతారు). ఈ దస్ నంబరీలు ఆంధ్రప్రదేశ్ ను ఇక్కట్ల పాల్జేశారని విమర్శించారు.