: కాంగ్రెస్ కండువా కప్పుకున్న విజయశాంతి
అలనాటి సినీ హీరోయిన్ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంచిరోజు కావడంతో ఈ రోజు (గురువారం) కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని ఆమె ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ప్రకటించి ఇచ్చిన మాటను నిలబెట్టుకుందని, ఆ పార్టీ విధానాలు నచ్చే కాంగ్రెస్ పార్టీలో చేరానంటూ ఆమె సంతోషంతో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ‘రాములమ్మ’కు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
విజయశాంతి తొలుత భారతీయ జనతాపార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తరువాత మెదక్ ఎంపీగా టీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన విజయశాంతి తర్వాత టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఏ పార్టీలోకి చేరుతారా అన్న విషయంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడిక కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఉత్కంఠకు తెరపడింది. అయితే వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేస్తారనేది మాత్రం ఇంకా తేలలేదు.