: సైనికుల కన్నా వ్యాపారులే ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారు: మోడీ
భారత్ లో వ్యాపారులు... సైనికుల కన్నా ఎక్కువ రిస్క్ తీసుకుంటున్నారని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత వ్యాపారులు ప్రపంచ ప్రత్యర్థుల సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో, ఎంతో రిస్క్ తీసుకుంటున్నారని వివరించారు. ఇతర దేశాల కంపెనీలను అధిగమించేందుకు ప్రతి సవాల్ ను ఓ అవకాశంలా మలుచుకోవాలని ఉద్భోధించారు. వ్యాపారులు టెక్నాలజీ సాయంతో తమ వాణిజ్య కార్యకలాపాల విస్తృతిని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్ళను అధిగమించాలంటే టెక్నాలజీని అందిపుచ్చుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. 'గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు సైతం బ్రాండెడ్ వస్తువుల కోసం చూస్తున్నారు. చిన్న వ్యాపారులు ఆన్ లైన్ మార్కెటింగ్ పై దృష్టి పెట్టాల్సిన తరుణమిదే' అని చెప్పారు.