: తెలంగాణపై వైఎస్ అసెంబ్లీలో హామీ ఇచ్చారు: జైరాం రమేశ్
ఎన్నికల దృష్ట్యానే రాష్ట్ర విభజన చేశారన్న ఆరోపణలను ఖండిస్తున్నానని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ అన్నారు. 1969, 70లలో తెలంగాణ, జై ఆంధ్రా ఉద్యమాలు వచ్చాయని, ఈ క్రమంలో 2009 అసెంబ్లీలో తెలంగాణ ఏర్పాటుపై వైఎస్ హామీ ఇచ్చారని చెప్పారు. 2004, 09 ఎన్నికల్లో తెలంగాణ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చామన్నారు. తెలంగాణ ఏర్పాటుపై 2013 జూలైలో సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుందని, దాని తర్వాత అన్ని పార్టీల్లో విభజన వచ్చిందనీ అన్నారు. విభజన ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదన్న జైరాం... తెలంగాణ ఏర్పాటు అంశాన్ని తాము (కాంగ్రెస్) పదేళ్ల పాటు పరిశీలించామని పేర్కొన్నారు. హైదరాబాదులో గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జైరాం, బిల్లుకు లోక్ సభలో మద్దతిచ్చిన బీజేపీ రాజ్యసభలో మాట మార్చి రాజ్యాంగ విరుద్ధంగా ఉందంటూ మెలికపెట్టిందన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రాజ్యాంగబద్ధమైనదేనని ఆయన స్పష్టం చేశారు.