: మార్చి నెల నుంచి గ్యాస్ సిలిండర్ కి ‘ఆధార్’, అకౌంట్ అక్కర్లేదు!
మహిళలకు శుభవార్త. వంట గ్యాస్ అయిపోతే, సిలిండర్ తీసుకొనేందుకు వచ్చే నెల నుంచి ఆదుర్దా పడనవసరం లేదు. ఇప్పడున్న ఆధార్, బ్యాంక్ ఖాతా లింకేజీతో సంబంధం లేకుండా, పాత పద్ధతిలోనే సబ్సిడీ సిలిండర్లు తీసుకోవచ్చు. ఈ మేరకు మరో మూడు రోజుల్లో ఆయిల్ కంపెనీలకు కేంద్రప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుంది. మార్చి నెల నుంచి గ్యాస్ సిలిండర్ల డెలివరీకి పాత పద్ధతి అమల్లోకి రానుందని గ్యాస్ డీలర్ల సంఘం ప్రతినిధి తెలిపారు.
గ్రేటర్ హైదరాబాదులో వంటగ్యాస్ కు ఆధార్ అనుసంధానంతో ప్రత్యక్ష ప్రయోజన పథకం అమల్లోకి వచ్చి 9 నెలలవుతోంది. ఇప్పుడున్న పద్ధతిలో మొదట సిలిండర్ బుక్ చేసుకొని తీసుకొనేటప్పుడు పూర్తి ధరను అంటే 1220 రూపాయలను వినియోగదారులు చెల్లించాల్సి వస్తోంది. తర్వాత వినియోగదారుల ఖాతాలో సబ్సిడీ సొమ్ము 741 రూపాయలను ప్రభుత్వం జమ చేస్తోన్న విషయం విదితమే. మార్చి నెల నుంచి, సబ్సిడీని మినహాయించి మిగిలిన ధర చెల్లించి సిలిండర్ తీసుకునే వెసులుబాటును కేంద్రం కల్పించింది.