: చిరు నోట కల్యాణ్ మాట!
'ఏడీ... కల్యాణ్ ఏడీ?' అంటూ తన చిన్న తమ్ముడి గురించి కేంద్ర మంత్రి చిరంజీవి ఆరా తీశారు. అయితే, అప్పటికే పవన్ కల్యాణ్ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. చిరంజీవి పెద్దతమ్ముడు నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రంగప్రవేశం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'తనను ఎవరైనా ఏం సంపాదించావు, చిరంజీవి?' అని అడిగితే అభిమానులను సంపాదించానని గర్వంగా చెబుతుంటానని తెలిపారు.
తన జీవిత ప్రయాణంలో ఆదరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తన వారసులుగా రాంచరణ్, బన్నీ, శిరీష్ ఉన్నారని మరో వారసుడు వరుణ్ తేజ్ ను సినీరంగానికి పరిచయం చేస్తున్నానని ఆయన తెలిపారు. ఆరుడుగుల మూడంగుళాల అందగాడు వరుణ్ తేజ్ ను ఆదరించాల్సిన బాధ్యత అభిమానులదేనని ఆయన తెలిపారు.
వరుణ్ కు చరణ్ అన్న ప్రోత్సాహం ఉంటుందని అన్నారు. వారిద్దరూ సినిమాల మీద మంచి విశ్లేషణలు చేసుకుంటారని, తాను వాటిని విని ఆనందిస్తుంటాననీ చిరంజీవి అన్నారు. వీరంతా అభిమానుల పట్ల కృతజ్ఞతలు కలిగి ఉండాలని అన్నారు. అభిమానులను అలరించేందుకు, ఆహ్లాదకరంగా ఉంచేందుకు కష్టపడాలని ఆయన సూచించారు.