: ఆర్జేడీ-కాంగ్రెస్ కు చేయిచ్చిన పాశ్వాన్.. బీజేపీతో జట్టు
బీహార్లో మిత్రపక్షమైన జనతాదళ్ యునైటెడ్ ను కోల్పోయిన బీజేపీకి మరో మిత్రుడు దొరికాడు. లోక్ జన్ శక్తి పార్టీ అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ బీజేపీతో జట్టుకట్టడం ఖాయమైపోయింది. రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-ఎల్జేపీ కలసి పోటీ చేయనున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీ ఎల్జేపీకి 8 లోక్ సభ స్థానాలను కేటాయిస్తుంది. మిగతా 32 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య ఈ రోజు పొత్తు కుదిరింది.
వాస్తవానికి ఎల్జేపీ ఒకప్పుడు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామి. ఆ తర్వాత ఎన్డీయేకు దూరమై.. కాంగ్రెస్, ఆర్జేడీకి దగ్గరైంది. అయితే, ఈ సారి 8 లోక్ సభ స్థానాలు తమకు కేటాయించాలని పాశ్వాన్ పట్టుబట్టారు. రాహుల్ గాంధీ, సోనియా, లాలూతో పలుసార్లు సమావేశమై చర్చలు జరిపారు. ఫలితం లేకపోవడంతో బీజేపీతో సంప్రదింపులకు దిగారు. దళితుల ఓటు బ్యాంకు కలిగిన పార్టీ కావడం, పాత మిత్రుడు అవడంతో బీజేపీ పాశ్వాన్ తో పొత్తుకు ముందుకు వచ్చింది.