: విభజనతో చిత్ర పరిశ్రమ సీమాంధ్రకు తరలిపోనుందా?
తెలుగు చిత్ర పరిశ్రమ ఒకప్పుడు మద్రాస్ లో ఉండేది. మద్రాస్ నుంచి సీమాంధ్ర ప్రాంతం వేరుపడిన తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ క్రమంగా హైదరాబాద్ కు చేరుకుంది. తెలంగాణ, సీమాంధ్ర కలసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించడంతో చిత్ర పరిశ్రమ రాజధాని హైదరాబాద్ కు మారడానికి వీలు కల్పించింది. ఇన్నేళ్ల తర్వాత.. హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమ ఓ స్థాయిలో స్థిరపడిన తర్వాత ఇప్పుడు రాష్ట్ర విభజన జరుగుతుండడంతో దీని భవిష్యత్తు ఏమిటా? అన్న సందేహాలు నెలకొన్నాయి.
నిజానికి తెలుగు చిత్రసీమలో ఎక్కువ మంది దర్శకులు, నిర్మాతలు, నటీ నటులు కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వారే ఉన్నారు. రూ. 1,000 కోట్ల రూపాయల పరిశ్రమపై వారిదే ఆధిపత్యం అనడంలో సందేహం లేదు. హైదరాబాద్ లో రామానాయుడు స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ, అన్నపూర్ణ స్డూడియోస్, సారథీ స్టూడియో, ప్రసాద్ ల్యాబ్స్, ఇతర ప్రముఖ సంస్థలు కొలువై ఉన్నాయి. స్టూడియోలు ఇక్కడే ఉన్నా.. ప్రకృతి పరంగా అందమైన ప్రదేశాలు అరకు, విశాఖ, రాజమండ్రి, తలకోన, హార్స్ లీ హిల్స్, తిరుపతి తదితర ప్రాంతాలలో ఉండడంతో సినిమాల్లో కొంత భాగం అక్కడే చిత్రీకరిస్తున్నారు. విశాఖలో ఇప్పటికే రామానాయుడు స్టూడియో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. మరి ఇప్పుడు సీమాంధ్ర ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడుతున్నందున నిర్మాతలు తమ మకాం ఆ ప్రాంతానికి మారుస్తారా? అన్న ప్రశ్న ఎదురవుతోంది.
దీనిపై ప్రముఖ నిర్మాతలు సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ తమ అభిప్రాయాలు వెల్లడించారు. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలన్నది తమ ఆకాంక్ష అని, త్వరలో ఏర్పడే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో వేచి చూడాల్సి ఉందన్నారు. చిత్ర పరిశ్రమ తరలింపు అంత తేలికైన విషయం కాదని చెప్పారు. పన్నులు, మౌలిక సదుపాయాలు, చిన్నారుల విద్య, ఆదాయం మొదలైన అంశాలపై ఇది ఆధారపడి ఉంటుందన్నారు.
నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల క్రితం పరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు మారినా.. ఇప్పటికీ కొన్ని విభాగాలు హైదరాబాద్ కు తరలిరాలేదన్నారు. విభజన ఇప్పుడే మొదలైందని.. నిర్మాతలు ఏ రాష్ట్రంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేదీ.. పన్నుల విధానమే నిర్ణయిస్తుందన్నారు.