: ఆసీస్ ఆరోపణలను ఖండించిన సఫారీలు
పోర్ట్ ఎలిజబెత్ టెస్టులో బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డారని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ చేసిన ఆరోపణలను సఫారీలు ఖండించారు. దక్షిణాఫ్రికా జట్టు మేనేజర్ మహ్మద్ మూసాజీ మాట్లాడుతూ, వార్నర్ వ్యాఖ్యలు 'ఆడలేక మద్దెల ఓడు' సామెతను గుర్తుకు తెస్తున్నాయని ఎద్దేవా చేశాడు. జట్టు ప్రదర్శనను తక్కువ చేసి చూపడంతోపాటు, మూడో టెస్టులో తమ ఏకాగ్రతను దెబ్బతీసేందుకే ఆసీస్ శిబిరం ఈ వ్యూహాత్మక ఎత్తుగడ వేసిందని మూసాజీ ఆరోపించాడు.
అంతకుముందు, రెండో టెస్టులో 448 పరుగుల లక్ష్య ఛేదనలో ఓ దశలో తమ స్కోరు 126/0 కాగా, అక్కడి నుంచి కథ మలుపు తిరిగిందని వార్నర్ అన్నాడు. బంతి విపరీతంగా రివర్స్ స్వింగ్ అవడంతో తాము 216 పరుగులకే ఆలౌటయ్యామని, సఫారీలు బాల్ టాంపరింగ్ కు పాల్పడి ఉంటారని ఈ ఆసీస్ ఓపెనర్ అభిప్రాయపడ్డాడు. వికెట్ కీపర్ ఏబీ డివిలీర్స్ బంతిని గ్లోవ్ లోకి తీసుకుని ఏదో చేసి ఉంటాడని సందేహం వ్యక్తం చేశాడు.