: వై-ఫైతో వైరస్ వస్తోంది, జాగ్రత్త!
కంప్యూటర్ లో గానీ, ఇంటర్ నెట్ ద్వారా గానీ వైరస్ ఏమైనా వస్తే.. సాధారణంగా మనం వాడే యాంటీ వైరస్ దాన్ని సమర్థంగా అడ్డుకుంటుంది. కానీ వై-ఫై ద్వారా వస్తున్న కొత్త వైరస్ ను మాత్రం ఎవరూ అడ్డు అదుపూ చేయలేకపోతున్నారు. ఈ విషయంలో యాంటీ వైరస్ సాఫ్ట్ వేర్ కూడా చేతులెత్తేస్తోంది. గాలి ద్వారా, వై-ఫై సంకేతాలతో కంప్యూటర్లలోకి వస్తోన్న ఈ వైరస్ ను ఎలా అడ్డుకోవాలన్న విషయంలో నిపుణులు ఇప్పుడు తలమునకలై ఉన్నారు. ముఖ్యంగా కాఫీ షాపుల్లో ఉచితంగా లభించే ఓపెన్ యాక్సెస్ వై-ఫై ద్వారానే ఈ వైరస్ వస్తోందని పరిశోధకులు గుర్తించారు.
సాధారణంగా ఇళ్లలో గానీ, ఆఫీసుల్లో గానీ ఉండే వై-ఫై అయితే సెక్యూరిటీ పాస్ వర్డ్ తో ఉంటుంది. పాస్ వర్డ్ ఎంటర్ చేస్తేనే వై-ఫై సంకేతాలు కంప్యూటర్లకు చేరుకుంటాయి. కానీ, కస్టమర్ల సౌలభ్యం కోసం కొన్ని షాపింగ్ మాల్స్, కాఫీ షాపుల్లో చివరకు మల్టీప్లెక్సుల్లో కూడా ఉచితంగా వై-ఫై సదుపాయం కల్పిస్తున్నారు. సింగపూర్, కౌలాలంపూర్ లాంటి చోట్ల అయితే ఏకంగా నగరం మొత్తానికి ఉచితంగా వై-ఫై సంకేతాలు అందుతున్నాయి. అలాంటి చోటే ప్రధానంగా సరికొత్త వైరస్ విస్తరిస్తోందని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు. ‘కెమిలియన్’ అని పిలిచే ఈ వైరస్ ను వాళ్లు పరిశోధనల కోసం వైరస్ ను సృష్టించి మరీ ప్రయోగించారు. పాస్ వర్డ్, ఎన్ క్రిప్షన్ లు లేని వై-ఫై లను అది సులభంగా పసిగట్టి లోనికి ప్రవేశిస్తోందని పరిశోధనలో తేలింది. ఇప్పుడు హ్యాకర్లు ఎక్కువగా వై-ఫై కనెక్షన్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని కూడా పరిశోధకులు తెలిపారు. అందుకే, వై-ఫై కనెక్షన్ కు తప్పనిసరిగా పాస్ వర్డ్ పెట్టుకోవాలని కూడా వారు సూచిస్తున్నారు.