: భవిష్యత్తుల్లో ఇంటర్నెట్ ఫ్రీ
మానవాళి ప్రగతికి, అభివృద్ధికి అత్యావశ్యకమైన ఇంటర్నెట్ కు ఎందుకు డబ్బులు చెల్లించాలి? అందరికీ ఉచితంగా ఇంటర్నెట్ లభిస్తే బావుండు కదా! ఊహించడానికి కూడా రాని ఈ ఆలోచనను అమెరికాకు చెందిన మీడియా డెవలప్ మెంట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ అనే స్వచ్చంద సంస్థ కలగంది. దాని సాకారం కోసం నడుం బిగించింది. అవుటర్ నెట్ పేరుతో పోయిన డిసెంబర్ లో ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది అనుకున్నది అనుకున్నట్లు పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ ఉచితంగా ఇంటర్నెట్ అందుతుంది. గడవు 2015 జూన్.
వందల సంఖ్యలో చిన్న చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం.. ఆ తర్వాత వాటన్నింటినీ ఒక నెట్ వర్క్ గా ఏర్పాటు చేయడం. అంతే, అవుటర్ నెట్ రెడీ అయినట్లే. ఇందులో భాగంగా ఈ సంస్థ ముందుగా వచ్చే ఏడాది జనవరిలో అంతరిక్షంలోకి కొన్ని చిన్న ఉపగ్రహాలను పంపనుంది. ఫలితాలు బావుంటే ఏప్రిల్ నుంచి పెద్ద సంఖ్యలో పంపిస్తుంది. ఇందుకోసం అవసరమయ్యే నిధులను సేకరించే పనిలో నిమగ్నం అయింది. ఇది సాకారమైతే ప్రపంచగతి మారిపోతుంది.