: కేసీఆర్ విజయోత్సవ ర్యాలీకి పోలీసుల గ్రీన్ సిగ్నల్
కేసీఆర్ ఢిల్లీ నుంచి హైదరాబాదులో అడుగుపెట్టగానే విజయోత్సవ ర్యాలీని ధూంధాంగా చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేశాయి. ఈ ర్యాలీకి హైదరాబాదు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ర్యాలీ జరగనున్న ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. కేసీఆర్ ర్యాలీ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. నాంపల్లి, ఖైరతాబాద్ పీజేఆర్ విగ్రహం, లోయర్ ట్యాంక్ బండ్, రైల్ నిలయం ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని సీపీ అనురాగ్ శర్మ చెప్పారు.
కేసీఆర్ న్యూఢిల్లీ నుంచి బయల్దేరి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. విజయోత్సవ ర్యాలీ బేగంపేటలో ప్రారంభమై నాంపల్లి గన్ పార్కు అమరవీరుల స్థూపం వరకు కొనసాగుతుంది. బేగంపేట నుంచి మొదలయ్యే ర్యాలీ శ్యాంలాల్ బిల్డింగ్స్, గ్రీన్స్ లాండ్స్, సీఎం క్యాంప్ ఆఫీస్, రాజీవ్ చౌక్, పంజాగుట్ట చౌరస్తా, నిమ్స్ ఆసుపత్రి, ఎర్రమంజిల్, ఖైరతాబాద్ మీదుగా నాంపల్లికి చేరుకుంటుంది.