: ముస్లింలకు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమంటున్న బీజేపీ
లోక్ సభ ఎన్నికల్లో ముస్లిం ఓటు బ్యాంకులను సొంతం చేసుకోవాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. తమ వల్ల గతంలో ముస్లింలకు వాటిల్లిన నష్టాలేవైనా ఉంటే అందుకు క్షమాపణ చెప్పేందుకైనా సిద్ధమేనంటోంది. ఢిల్లీలో ఇవాళ ముస్లింలనుద్దేశించి మాట్లాడుతూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీ ముస్లిం వ్యతిరేకి అన్న కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. మా వల్ల ఎక్కడైనా, ఎప్పుడైనా ముస్లింలకు చెడు జరిగి ఉంటే తలవంచి క్షమాపణ వేడుకుంటాం. దేశం కోసం ఈ ఒక్కసారి మాకు అవకాశమిచ్చి చూడండి, మీ అంచనాలను అందుకోకపోతే, మరోసారి మా ముఖం చూడవద్దు' అని పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఓటేయొద్దని, బలమైన జాతి నిర్మాణం కోసం, సోదర, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు ఓటేయండని రాజ్ నాథ్ పిలుపునిచ్చారు.