: కాంగ్రెస్ సమావేశంలో వర్గ పోరు.. బాహాబాహీ
తెలంగాణ ఏర్పాటు సందర్భంగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ అదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం వివాదాస్పదంగా ముగిసింది. దీంతో, జిల్లా కాంగ్రెస్ లోని వర్గవిభేదాలు బయటపడ్డాయి. సమావేశంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో వివిధ నేతల ఫోటోలు లేకపోవడంతో వివాదం రేగింది. ఎమ్మెల్సీ వెంకటరావు ఫోటో ఎందుకు పెట్టలేదని ఆయన వర్గీయులు జిల్లా నేతలను నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, పీసీసీ కార్యదర్శి దండ సుజాతల ఫోటోలు లేవంటూ వారి వర్గీయులు కూడా ఆందోళనకు దిగారు.
దీంతో సమావేశంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంతలో సందట్లో సడేమియాలా స్టేజ్ మీదున్న ఫ్లెక్సీని కొందరు చించేశారు. దీంతో వారిలో వారే బాహాబాహీకి దిగారు. ఎవరు ఎవర్ని తోస్తున్నారో, ఎవరు ఎవర్ని కొడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. చివరికి జిల్లా నేతలు క్షమాపణలు కోరడంతో ఆయా వర్గీయులు శాంతించారు.