: ఆర్జేడీ రెబల్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించిన నితీష్
ఆర్జేడీకి రాజీనామా చేసి ప్రత్యేక కూటమిగా ఏర్పడిన 13 మంది ఎమ్మెల్యేలు ... అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వారందరినీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జేడీ(యు)లోకి ఆహ్వానిస్తున్నారు. పార్టీలో చేరాలనుకునే వారు చేరవచ్చని సంకేతాలు పంపించారు. అయితే, ప్రత్యేక కూటమిగా గుర్తించాలంటూ రెబల్ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తన కోరిక మేరకే పరిగణనలోకి తీసుకుని తనకు అనుగుణంగా పనిచేశారన్న ఆరోపణలను నితీష్ ఖండించారు. ఢిల్లీలో జరగనున్న థర్డ్ ఫ్రంట్ సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చిన నితీష్ పైవిధంగా మాట్లాడారు. లాలూకు, ఎమ్మెల్యేలకు మధ్య విడిపోయే స్థాయిలో విభేదాలున్నాయన్నారు. అయితే, పార్టీ స్టాండ్ మేరకు ఎవరయినా వస్తానంటే పార్టీ తప్పకుండా ఆహ్వానిస్తుందని పేర్కొన్నారు.