: బాధ్యతను విస్మరిస్తున్న సెన్సార్ బోర్డు: ఢిల్లీ హైకోర్టు


కేంద్ర సెన్సార్ బోర్డుపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు తన బాధ్యతను సరిగా నిర్వర్తించడంలేదని తీవ్రంగా వ్యాఖ్యానించింది. హింది చిత్రాలు 'దబాంగ్-2', 'రేస్-2' చిత్రాల్లో అసభ్య సన్నివేశాలున్నాయంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) విచారించిన చీఫ్ జస్టిస్ డి.మురుగేశన్, జస్టిస్ వికె జైన్ లతో కూడిన బెంచ్ ఘాటుగా స్పందించింది.

ఈ వ్యవహారంపై మే 14లోగా కోర్టులో తమ స్పందన తెలియజేయాలని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, సీబీఎఫ్ సీ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిమ్ సర్టిఫికేషన్), చిత్రాల నిర్మాతలను ఆదేశించింది. దబాంగ్-2లో నటి కరీనాకపూర్ పై చిత్రీకరించిన ప్రత్యేక పాటను తొలగించాలని ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీనిని జస్టిస్ వికె జైన్.. తిరస్కరించారు.

ఇందులో నటి పేరును ఎందుకు ప్రస్తావించారని పిటిషనర్ ను ప్రశ్నించారు. పేర్లు తొలగించి మళ్లీ కొత్త పిటిషన్ వేయాలని సూచించారు. కాగా, దబాంగ్-2, రేస్-2 డివిడిల విడుదలపై స్టే విధించాలని, టివి చానల్స్ లో ప్రసారం కాకుండా ఆపివేయాలన్న విజ్ఞప్తిని బెంచ్ నిరాకరించింది. కేవలం ఫోటోల ఆధారంగా చిత్ర ప్రదర్శనపై స్టే ఇవ్వలేమని పేర్కొంది.

మరోవైపు రేస్-2 చిత్రం థియేటర్లలో ప్రదర్శించకుండా తక్షణమే నిషేధం విధించాలంటూ టీనా శర్మ అనే సామాజిక కార్యకర్త పిల్ దాఖలు చేశారు. దీనిని విచారించిన బెంచ్... సెన్సార్ బోర్డు చాలా ఉదారంగా వ్యవహరిస్తోందని పేర్కొంది. ప్రతి చిత్రానికీ ఎలాంటి అభ్యంతరం లేకుండా అనుమతి సర్టిఫికెట్ ఇస్తోందని వ్యాఖ్యానించింది. చిత్రాల్లోని ప్రత్యేక పాటలను అసభ్యంగా చూపిస్తున్న విధానంపట్ల కేంద్ర సమాచార శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అలాగే, రేస్-2 చిత్రంలోని సన్నివేశాలపై 15 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని సీబీఎఫ్ సీని ఆదేశించింది. 

  • Loading...

More Telugu News