: నాన్ ఐడెంటిఫయింగ్ 'స్మోకర్సే' ఎక్కువ!
సిగరెట్లు తాగేవారిని స్మోకర్స్ అంటారు. సరే, మరి, పొగతాగుతూ కూడా తమకసలు ఆ అలవాటు లేదని బొంకేవారిని నాన్ ఐడెంటిఫయింగ్ స్మోకర్స్ (NIS) అని అంటారు. అయితే, ఇప్పుడు పొగతాగే వారిలో అత్యధికులు వారేనట. ఈ విషయం కాలిఫోర్నియా వర్శిటీలో శాన్ డియాగో శాఖ జరిపిన తాజా పరిశోధనలో వెల్లడైంది. సిగరెట్లు తాగే వారిలోని ఈ 'నిస్'తత్వం వ్యక్తిగతంగానే కాక సామాజికపరంగా కూడా అనేక ప్రభావాలు చూపిస్తుందని పరిశోధనల్లో తేలింది. ఈ పరిశోధనా వివరాలను టొబాకో కంట్రోల్ అనే పత్రికలో ప్రచురించారు.
ధూమపానం ఎక్కువగా చేయడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు కలుగుతుందో, సిగరెట్లు తాగుతూ కూడా తాగబోమని బుకాయించేవారికి కూడా అలాంటి ప్రమాదమే జరుగుతుందని పరిశోధకుడు అల్డెలియేమి తెలిపారు. ఈ తరహా మనస్తత్వం ఉన్న వారు ధూమపానం మానరు, దాంతో స్మోకింగ్ వల్ల కలిగే ప్రమాదాలు వీరికి ఎక్కువ. అలాగే, స్మోకింగ్ మానేందుకు కూడా వీరు ఎలాంటి ప్రయత్నం చేయరు. ఇలాంటి వారిలో 22 శాతం మంది ప్రతి దినం ధూమపానం చేస్తారని ఈ పరిశోధనలో తెలిసింది.
పరిశోధనలో ఇంకో ఆసక్తికరమైన విషయం కూడా వెల్లడైంది. తక్కువ వయస్సున్న నాన్ ఐడెంటిఫయింగ్ స్మోకర్లలో ఎక్కువ మంది కళాశాల విద్యార్థులే. తమ పరిసరాల్లో ఉన్నవారు తాగుతున్నారు కాబట్టి తామూ తాగుతున్నామని వారు చెప్పారని, కావాలనుకుంటే మున్ముందు ఎప్పుడైనా ధూమపానాన్ని మానేస్తామని చెప్పారు. ఇక, నాన్ ఐడెంటిఫయింగ్ స్మోకర్లలో పెద్ద వయసు వారు ఎక్కువగా బడుగు వర్గాలకు చెందిన వారు. సిగరెట్టు తాగుతామని చెప్పటం వల్ల, పొగతాగే అలవాటు గురించి మాట్లాడటం వల్ల ఎలాంటి లాభం లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.