: గంగూలీని 'పరుగు'లు పెట్టించిన సచిన్!


భారత క్రికెట్ రంగంలో మహోన్నత శిఖరం అనదగ్గ బ్యాట్స్ మన్ నిస్సందేహంగా సచిన్ టెండూల్కరే. కానీ, చంద్రునికో మచ్చలా కెప్టెన్సీ వైఫల్యం అతని ఖాతాలో చేరిపోయింది. అప్పట్లో విండీస్ టూర్లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు గంగూలీ పుణ్యమాని వెలుగులోకి వచ్చింది. సచిన్లో నాయకత్వ లక్షణాలు కొరవడ్డాయని చెప్పేందుకు ఇదీ ఓ నిదర్శనమే. ఆ పర్యటనలో మూడో టెస్టును భారత్ 38 పరుగుల తేడాతో కోల్పోయింది. దీంతో, జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సచిన్, ఇతర సభ్యులపై ఇంతెత్తున ఎగిరాడట.

మాస్టర్ కోపాన్ని తగ్గించాలని నిశ్చయించుకున్న గంగూలీ, 'ఇప్పుడు ఏం చేయమంటావు సచిన్?' అని అడిగాడు. అప్పటికే కోపం నషాళానికంటిన ముంబయి వాలా 'రేపు ఉదయాన్నే లేచి గ్రౌండ్ చుట్టూ రౌండ్లు కొట్టు' అని ఆదేశించాడు. అప్పటికే జట్టులో మహారాజా స్టేటస్ అనుభవిస్తున్న గంగూలీ కెప్టెన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తర్వాతి రోజు హోటల్ గదికే పరిమితమయ్యాడు. దీంతో, సచిన్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కోపంతో ముఖం ఎర్రబారింది.

వెంటనే గంగూలీని టూర్ మధ్యలోనే భారత్ కు పంపేయాలని నిర్ణయించుకున్నాడు. అదే జరిగితే తన కెరీర్ కు బ్రేక్ పడుతుందని భావించిన దాదా... మరుసటి రోజు ఉదయాన్నే కాళ్ళకు షూ తగిలించుకుని మైదానానికి పరుగులు పెట్టాడట. ఈ విషయాలన్నీ గంగూలీనే ఓ పుస్తకంలో పేర్కొన్నాడు. కెప్టెన్ ఆజ్ఞను పాటించకపోవడం తన తప్పేనని ఒప్పుకున్న దాదా, మరో విషయం బయటపెట్టాడు. తన మాట వినలేదన్న కోపంలో సచిన్ రాయడానికి వీల్లేని భాషలో హెచ్చరించాడని వెల్లడించాడు.

  • Loading...

More Telugu News