: సీమాంధ్రకు రాజధానిగా రాజమండ్రే కరెక్ట్: సర్వారాయుడు
సీమాంధ్ర ప్రాంతంలోని జిల్లాలకు రాజధానిగా రాజమండ్రే సరైనదని బీజేపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ నేత సర్వారాయుడు అభిప్రాయపడ్డారు. పార్టీ ఆదేశిస్తే, రాజమండ్రి నుంచి పోటీ చేసేందుకు తాను సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. రాజమండ్రిలో ఈరోజు (సోమవారం) సర్వారాయుడు మీడియాతో మాట్లాడుతూ, చారిత్రాత్మకమైన రాజమండ్రి నగరానికి రాజధానికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఉన్నాయని, తగినంత భూమి కూడా అందుబాటులో ఉందని తెలిపారు.
హైదరాబాదు నుంచి కార్యకలాపాలు సాగిస్తున్న వివిధ బహుళజాతి కంపెనీలు తమ ప్రధాన కార్యాలయాలను సీమాంధ్రకు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు చమురు సంస్థలు, ఫార్మసీ కంపెనీలు తమ కార్యాలయాలను సీమాంధ్ర ప్రాంతానికి తరలించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం సీమాంద్ర ప్రాంత అభివృద్ధిపైనే సీమాంధ్రులు దృష్టి పెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.