: ఎంపీ నిధుల నుంచి పైసా విదల్చని సచిన్, రేఖ
దేశంలోని వివిధ రంగాలకు విశిష్ఠ సేవలందించిన వ్యక్తులకు రాజ్యసభలో స్థానం కల్పిస్తే, వారిలో కొందరు ప్రజలకు చేసే సేవ మాత్రం శూన్యం. సచిన్ టెండూల్కర్... క్రికెట్ ఆణిముత్యం. ఇటీవలే భారతరత్న కూడా అందుకున్నారు. రేఖ... తన అందంతో బాలీవుడ్ సినిమాకు కొత్త గ్లామర్ అద్దిన ప్రతిభావని. రెండేళ్ళ క్రితం వీరిద్దరినీ రాజ్యసభకు ఎంపిక చేస్తే, వారు తిరిగి సమాజానికి చేసింది ఏమీలేదు. సమావేశాలకు హాజరైనా మొక్కుబడి తంతే. తమకు కేటాయించే ఎంపీ లాడ్స్ నుంచి పైసా విదిల్చిన దాఖలాల్లేవు. రాజ్యసభ సభ్యులకు ఓ అవకాశం ఉంటుంది. వారు ఏదైనా జిల్లాను దత్తత తీసుకుని దానిని అభివృద్ధి చేయవచ్చు. ఈ పథకంలో భాగంగా సచిన్ ముంబయి సబర్బన్ ఏరియాను దత్తత తీసుకోగా, రేఖ ఏ ప్రాంతాన్నీ తీసుకోలేదు.
ప్రతి ఎంపీకి ఎంపీలాడ్ (మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్ మెంట్) పథకం ద్వారా ఏటా రూ. 5 కోట్లు ఇస్తారు. ఆ లెక్కన వీరిద్దరి వద్ద చెరో పది కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. తమ రెండేళ్ళకాలంలో ఒక్క పని చేసినట్టు నివేదికలను పంపింది లేదు. పార్లమెంటు రికార్డులు చెబుతున్న వాస్తవాలివి. మరిప్పటికైనా సచిన్, రేఖ ప్రజాహితం కోరి నిధులను పథకాలకు వెచ్చిస్తారో, లేక పూర్తికాలం నిధులను నిల్వచేస్తారో కాలమే చెప్పాలి.