: రాష్ట్ర విభజన బాధాకరం... అయినా తప్పలేదు: దిగ్విజయ్ సింగ్
రాష్ట్ర విభజన బాధాకరమైన విషయమని, అయినా విభజన తప్పలేదని రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల అభివృద్ధి విషయం తమ మదిలో ఉందని ఆయన తెలిపారు. ఆంద్రప్రదేశ్ ప్రజలు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని దిగ్విజయ్ అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కుటుంబం నుంచే వచ్చారని ఆయన చెప్పారు. ఇరు ప్రాంతాల నాయకులు కలిసి కిరణ్ ను సీఎల్పీ నేతగా ఎన్నుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా కిరణ్ వ్యవహరించారని అన్నారు.
సీమాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులను ప్రభుత్వం ఇస్తుందని దిగ్విజయ్ తెలిపారు. సీమాంధ్ర ప్రాంతంలో ఏర్పడే ఆర్థిక లోటును పూడ్చడానికి ప్రత్యేక నిధులను ప్రభుత్వం ఇస్తుందని కూడా ఆయన చెప్పారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్నది మినహా మిగిలిన అన్ని డిమాండ్లను ప్రధాని అంగీకరించారని ఆయన అన్నారు.