: సార్వత్రిక ఎన్నికల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తాం: డీజీపీ
ఈసారి సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని రాష్ట్ర డీజీపీ ప్రసాదరావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో సీసీటీవీ కెమేరాలు, వెబ్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రసాదరావు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో నూతనంగా నిర్మించిన గొల్లపల్లి, జగిత్యాల పోలీస్ స్టేషన్ భవనాలను డీజీపీ ప్రారంభించారు.
3జీ టెక్నాలజీ, ఆండ్రాయిడ్ సహకారంతో ఐటీ కారిడార్ లో ఈ-సుధాన, ఎఫ్ఐఆర్ సిస్టమ్, పోలీస్ సంక్షేమ స్టోర్ ను ఆయన ప్రారంభించారు. దీని వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆయన అన్నారు. ఎస్ఐ నుంచి డీఎస్పీ ర్యాంక్ అధికారులకు 130 టాబ్లెట్ పీసీలను కూడా డీజీపీ పంపిణీ చేశారు.
ప్రారంభోత్సవం అనంతరం డీజీపీ ప్రసాదరావు, ఐజీ రవి గుప్తా, డీఐజీ ఆర్.బి.నాయక్ తదితరులతో కలిసి మీడియాతో మాట్లాడారు. సున్నితమైన ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు పారా మిలటరీ బలగాలను పంపాలని కేంద్రాన్ని కోరామని డీజీపీ చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంటు ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో శాంతి భద్రతల నియంత్రణ సమస్యగా మారుతుందని ఆయన అన్నారు.