: హైదరాబాదు నగరంలో సినిమా వేడుకలకు పోలీసుల 'చెక్'!
తమ అభిమాన కథానాయకుల సినిమా వేడుకలలో స్వయంగా పాల్గొని, కేరింతలు కొట్టాలనుకునే అభిమానులకు ఇకపై అలాంటి అవకాశం దొరకడం కష్టమే. ఎందుకంటే, ఇకపై హైదరాబాదు నగరంలో భారీ ఎత్తున నిర్వహించే సినిమా వేడుకలకు పోలీసుల అనుమతి లభించదు. ఇటీవల 'బాద్ షా' సినిమా ఆడియో వేడుక సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ అభిమాని మృతి చెందిన నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు.
ఇటీవలి కాలంలో నగరంలో టాలీవుడ్, బాలీవుడ్ రంగాలకు చెందిన తారలు పాల్గొనే వేడుకలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో జనం విపరీతంగా రావడం ... తొక్కిసలాటలు జరగడం ... గంటల కొద్దీ రోడ్లపై ట్రాఫిక్ నిలిచిపోవడం వంటి సమస్యలు ఎదురవుతుండడంతో పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 27న జరుగనున్న రామ్ చరణ్ జన్మదిన వేడుకలకు కూడా పోలీసులు అనుమతి నిరాకరించారు.
కేంద్రమంత్రి చిరంజీవి ఈ విషయంలో స్వయంగా జోక్యం చేసుకున్నప్పటికీ, పోలీసులు ససేమిరా అన్నట్టు సమాచారం. ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ, ఎట్టి పరిస్థితులలోనూ ఇకపై భారీ ఎత్తున జరిగే సినిమా వేడుకలకు అనుమతించకూడదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు చెబుతున్నారు