: అన్నీ మర్చిపోదాం, కలసిమెలసి ఉందాం: వెంకయ్య నాయుడు
బీజేపీ జాతీయస్థాయి నేత వెంకయ్య నాయుడు నేడు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగిపోయిందని, ఇక అన్నీ మర్చిపోయి కలసిమెలసి ముందుకు సాగాలని వెంకయ్య తెలుగు ప్రజలకు సూచించారు. తెలంగాణ, సీమాంధ్రలు అభివృద్ధిలో పోటీ పడాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో ఉన్నవారెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తెలంగాణపై తాము ఇచ్చిన మాటను నిలుపుకున్నామని, అయితే, కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రులకు న్యాయం చేయడంలో విఫలమైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడం ఇష్టంలేకున్నా, విభజన అంశంపై 15 రోజుల పాటు చర్చలు జరిపానని వెల్లడించారు. ఇక తెలంగాణ ఘనతను ఎవరికి ఆపాదించాలో ప్రజలే నిర్ణయించుకుంటారని వెంకయ్య పేర్కొన్నారు.