: ప్రేమించాడు... పెళ్లాడుతానన్నాడు... చివరకు ఉసురు తీశాడు!


అతడు ప్రేమిస్తున్నాడని చెబితే ఆమె నిజమేననుకొంది. పెళ్లి చేసుకుంటానని చెబితే ఆమె ఆనందపడింది. అతడి చేతిలో దారుణంగా మోసపోయానని అప్పుడామె తెలుసుకోలేకపోయింది. వారిద్దరి వివాహానికి అంగీకరించిన పెద్దలు పెళ్లి పత్రికలు వేయించారు. మరో ఐదు రోజుల్లో కాళ్లకు పారాణి పెట్టుకోవాల్సిన ఆమె, చివరకు అతడి చేతిలో హతమైంది. కన్నవారికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో జరిగింది.

ఈ దారుణానికి సంబంధించిన వివరాలను మంత్రాలయం పోలీసులు వెల్లడించారు. చిలకలడోణ గ్రామానికి చెందిన మార్తమ్మ(18), అదే గ్రామానికి చెందిన యోహాను ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం తెలుసుకున్న పెద్దలు ఈ నెల 26న వివాహం చేయాలని నిశ్చయించారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 8 గంటలకు యోహాను మార్తమ్మకు ఫోన్ చేసి పలానా చోటుకి రమ్మని చెప్పాడు.

తుంగభద్ర దిగువ కాలువ మీదుగా బాపురం రోడ్డుకు తీసుకెళ్లి, అక్కడే ఆమెను కడతేర్చాడు. ఆమెను చంపిన అనంతరం కాళ్లను కరెంట్ వైర్లతో కట్టేసి కాలువ చాంబర్ లో పడేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. కూతురు కోసం రాత్రంతా వెతికిన తల్లిదండ్రులు.. శుక్రవారం ఉదయం కూతురు శవం సగం కాలిపోయి కనిపించేసరికి భోరున విలపించారు. కూతురు జీవితాన్ని నాశనం చేసిన అతడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు ఆవేదనతో చెప్పారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతిని చంపేందుకు వాడిన కటింగ్ ప్లేయర్, హతమార్చిన ప్రదేశాలను పోలీసులు పరిశీలించారు. యోహానును అదుపులోకి తీసుకుని ఘటనపై ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News