: దేశంలో మళ్లీ చరిత్ర సృష్టించేది టీడీపీనే: చంద్రబాబు
తెలంగాణ ప్రాంతంలో బడుగు, బలహీన వర్గాలను అభివృద్ధి చేసింది టీడీపీయే అని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. తెలంగాణ విషయంలో టీడీపీ ఎన్నడూ వెనకడుగు వేయలేదని అన్నారు. హైదరాబాదుకు తాగునీటి సమస్య ఉంటే, ఒక్క సంవత్సరంలో కృష్ణా నీటిని నగరానికి తీసుకొచ్చామని గుర్తుచేశారు. తెలంగాణను కేసీఆర్ కాని, కాంగ్రెస్ కాని, వైకాపా కాని అభివృద్ధి చేసిందా? అని ప్రశ్నించారు. దేశంలో మళ్లీ చరిత్ర సృష్టించేది టీడీపీనే అని చెప్పారు. మొదట్నుంచి టీడీపీ సమన్యాయాన్నే కోరుతోందని... మాట తప్పలేదని స్పష్టం చేశారు. ఈ రోజు టీటీడీపీ నేతలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ప్రసంగించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కొన్ని జిల్లాల్లోనే ఉందని, సీమాంధ్రలో వైకాపా కొన్ని ప్రాంతాల్లోనే ఉందని, కాంగ్రెస్ పార్టీ అన్ని చోట్లా చతికిల పడిందని తెలిపారు. అన్ని ప్రాంతాల్లో టీడీపీ మాత్రమే ఉందని చెప్పారు. పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది టీడీపీనే అని చెప్పారు. పాదయాత్రలో తెలంగాణ మొత్తం తిరిగి సమస్యలను అర్థం చేసుకున్నానని తెలిపారు. తెలుగు ప్రజలను కలిపి ఉంచేది తెలుగుదేశం పార్టీయే అని అన్నారు.