: గ్రీన్ టీకి పెరుగుతున్న ఆదరణ
ఎన్నో ఆరోగ్య సుగుణాలు ఉన్న గ్రీన్ టీని భారతీయులు క్రమంగా తమ జీవితంలో భాగం చేసుకుంటున్నారు. దేశీయంగా గ్రీన్ టీ డిమాండ్ 17 శాతం పెరగడమే ఇందుకు నిదర్శనం. అదే సమయంలో బ్లాక్ టీ డిమాండ్ 3 శాతమే పెరిగిందని భారతీయ టీ బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దీపాంకర్ ముఖర్జీ తెలిపారు. అసోంలోని గోల్ ఘాట్ లో గ్రీన్ టీపై జరిగిన వర్క్ షాపు సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రపంచంలో బ్లాక్ టీ తయారీ, వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉంటే, గ్రీన్ టీ ఉత్పత్తి, వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉందని చెప్పారు. అసోంలో 2013లో మొత్తం 1.1కోట్ల కేజీల తేయాకు ఉత్పత్తి అయితే, అందులో 20లక్షల కేజీలు గ్రీన్ టీ ఉందని దీపాంకర్ తెలిపారు.
బరువు తగ్గడానికి గ్రీన్ టీ చక్కగా పనిచేస్తుంది. దీనిలో కెఫీన్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఉంటే కరిగిపోతుంది. కేన్సర్ ముప్పునూ తగ్గిస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కనీసం రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ అయినా తాగితే మంచిదని వైద్యులు కూడా సూచిస్తుంటారు.