: మోడీ పేరిట చేపల దుకాణాలు!
దేశంలో చాయ్ వాలాలకు ఉన్నట్టుండి గుర్తింపుతెచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఆయన గతంలో టీ అమ్మిన సంగతి కొంతకాలం కిందటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ విషయం తెలిసిన తర్వాత చాయ్ వాలాలు మోడీపై అభిమానం ప్రదర్శించసాగారు. ఇప్పుడు తమిళనాడు మత్స్యకారులనూ ఆకట్టుకునేందుకు ఆ పార్టీ తమిళనాడు శాఖ సిద్ధమైంది. తమిళనాట మోడీ పేరిట చేపల దుకాణాలు తెరవాలని భావిస్తోంది. ఈ 'న.మో' ఫిష్ స్టాల్స్ ఏర్పాటు ద్వారా తీర ప్రాంత వాసులకు దగ్గర అవ్వాలని బీజేపీ ప్రయత్నం.
ఈ నెల 25న చెన్నై లైట్ హౌస్ సమీపంలో తొలి దుకాణాన్ని ఏర్పాటు చేస్తామని, 200 మందికి ఉచితంగా చేపలు పంపిణీ చేస్తామని బీజేపీ వర్గాలు తెలిపాయి. కొన్నిరకాల చేపలను రాయితీపై అందిస్తామని కూడా పేర్కొన్నాయి. ప్రభుత్వ దుకాణాల్లో కంటే తాము తక్కువ ధరకే విక్రయిస్తామని బీజేపీ మత్స్యకార విభాగం నేత సతీశ్ కుమార్ చెప్పారు. ఈ స్టాళ్ళ ద్వారా తమిళనాడు మత్స్యకార సమస్యలు జాతీయ స్థాయికి తీసుకెళ్ళే అవకాశం కలుగుతుందని సతీశ్ అభిప్రాయపడ్డారు.