: రానున్న ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ రానున్న సాధారణ ఎన్నికలు మాత్రం ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే, ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆలోపు రాష్ట్ర విభజన జరిగే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఎందుకంటే ఉభయ సభలు ఆమోదించిన బిల్లు సోమవారం రాష్ట్రపతికి చేరే అవకాశం ఉంది. బిల్లుకు సంబంధించి ఆయన న్యాయపరమైన అంశాలను పరిశీలించుకుని ఆమోదముద్ర వేయడానికి, మరో వారం రోజులు పట్టవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రాష్ట్రపతి ఆమోదం తర్వాత విభజనకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ వెలువడుతుంది. అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి దాదాపు 75 రోజుల నుంచి మూడు నెలల సమయం పడుతుంది. చత్తీస్ గఢ్ (77 రోజులు), జార్ఖండ్ (85 రోజులు), ఉత్తరాఖండ్ (77 రోజులు) కు దాదాపుగా ఇంతే సమయం పట్టింది.
గెజిట్ లో ప్రచురించే నోటిఫికేషన్ లో కొత్త రాష్ట్ర ఏర్పాటును తెలిపే అపాయింటెడ్ డేట్ ను కేంద్రం ప్రకటిస్తుంది. ఆ తేదీ లోపలే రెండు రాష్ట్రాలకు సంబంధించి అన్ని ప్రక్రియలు (ఉద్యోగులు, ఖజానా ఏర్పాటు, ఆర్థిక, రాజధాని, నీరు, తదితరాలు) పూర్తికావాలి. కాబట్టి మూడు నెలల్లోపు రాష్ట్ర విభజన సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో, రానున్న ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోను రెండు రాష్ట్రాల్లో జరిగే అవకాశం లేదు. ఉమ్మడి రాష్ట్రంలోనే జరుగుతాయి.