: సీమాంధ్రలో విశాఖ, విజయనగరానికి బంగారు భవిష్యత్తు: అసోచామ్
సీమాంధ్ర రాష్ట్రంలో కోస్తా తీర పట్టణాలైన విశాఖ, విజయనగరం అభివృద్ధిలో దూసుకుపోనున్నాయని పారిశ్రామిక మండలి అసోచామ్ అంచనా వేసింది. వ్యాపార పరంగా హైదరాబాద్ ప్రపంచ హబ్ గా తన ప్రస్థానాన్ని ఇకముందూ కొనసాగిస్తుందని అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా ఏర్పడుతున్నందున అసోచామ్ తన అభిప్రాయాలను వెల్లడించింది. రెండు రాష్ట్రాలూ గొప్పగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
తెలంగాణపై గందరగోళం తొలగిపోయిందని, తెలంగాణ ఏర్పడిన తర్వాత.. రెండు రాష్ట్రాలు మరింతగా వృద్ధి చెందుతాయని అసోచామ్ ప్రెసిడెంట్ రాణాకపూర్ ఒక ప్రకటనలో తెలిపారు. సీమాంధ్రకు ఇచ్చిన ప్రత్యేక హోదా వల్ల ఆ ప్రాంతం పారిశ్రామిక పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మారుతుందని కపూర్ చెప్పారు. భౌగోళిక అనుకూలత, పోర్టు సిటీ కావడం, రైలు నెట్ వర్క్ ఉండడం, వీటికి తోడు పన్ను విరామం వల్ల విశాఖపట్టణం అత్యంత ఆకర్షణీయ వ్యాపార కేంద్రంగా అవతరిస్తుందన్నారు.
బాగా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధికి నిధులు ఖర్చు చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలని రాణా కపూర్ సూచించారు. కోస్తాంధ్రకు సహజ నీటి వనరులు, వ్యవసాయం వరంగా పేర్కొన్నారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.