: ఆరు నెలల్లో సీమాంధ్ర రాజధానిని నిర్ణయిస్తాం: జైరాం రమేష్


ఆంధ్రప్రదేశ్ విభజన ప్రక్రియ మొదలైందని... దీనికోసం రెండు కమిటీలను ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. సివిల్ సర్వీస్ అధికారుల కోసం ఒక కమిటీ, రాష్ట్ర స్థాయి అధికారుల కోసం మరో కమిటీ వేశామని చెప్పారు. రాష్ట్రంలోని 84 వేల మంది ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచాల్సిన అవసరం ఉందని అన్నారు. సీమాంధ్ర రాజధాని కోసం కమిటీ వేస్తున్నామని... మరో ఆరు నెలల్లోగా రాజధాని ఎక్కడ నిర్మించాలన్న విషయం కమిటీ నిర్ణయిస్తుందని తెలిపారు.

అపాయింటెడ్ డే ప్రకటన తర్వాత కొత్త రాష్ట్రం అధికారికంగా ఏర్పాటవుతుందని జైరాం రమేష్ తెలిపారు. అపాయింటెడ్ డే తేదీ నుంచి మూడు నెలల్లో జార్ఖండ్, ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్ ఏర్పడ్డాయని చెప్పారు. అపాయింటెడ్ డే నుంచి రెండు రాష్ట్రాలకు ఇద్దరు సీఎంలు, ఇద్దరు సీఎస్ లు, ఇద్దరు డీజీపీలు ఉంటారని తెలిపారు. హైదరాబాదు శాంతిభద్రతలను గవర్నర్ కు అప్పగించడంపై రాజ్యాంగబద్ధంగానే వెళ్లామని వెల్లడించారు.

ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తిరిగి సీమాంధ్రలో కలుపుతామని, బూర్గంపాడు మండలంలోని ఆరు గ్రామాలు మాత్రం తెలంగాణలోనే ఉంటాయని రమేష్ స్పష్టం చేశారు. దీనికోసం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలిపారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ఉంటుందని స్పష్టం చేశారు. సీమాంధ్ర ఆర్థిక ప్రణాళిక కోసం ప్లానింగ్ కమిషన్ లో ప్రత్యేక కమిటీ వేశామని... వచ్చే వారం నుంచి అది పని చేస్తుందని రమేష్ చెప్పారు. రెండు ప్రాంతాల నేతలు కలహాలు మాని పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం నుంచే నిధులు మంజూరు చేస్తామని కేంద్రమంత్రి జైరాం రమేష్ తెలిపారు.

  • Loading...

More Telugu News