: అంబానీకి, మీకూ లింకేంటి?.. మోడీకి కేజ్రివాల్ ఘాటు లేఖ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ ఓ బహిరంగ లేఖ రాశారు. రిలయన్స్ అధిపతి ముకేశ్ అంబానీపై తన వైఖరేంటో మోడీ స్పష్టం చేయాలని కేజ్రివాల్ డిమాండ్ చేశారు. గ్యాస్ ధరల పెంపు విషయంలో పెదవి విప్పాలని కోరారు. అంతేగాకుండా కొన్ని ప్రశ్నాస్త్రాలూ సంధించారు. 'ముకేశ్ తో మీ పార్టీకి, మీకూ ఉన్న సంబంధమేంటి? మీ ప్రచారానికి నిధులు ఎవరు సమకూరుస్తున్నారు? మీ సభలపై కోట్లాది రూపాయిలు ఎవరు ఖర్చు చేస్తున్నారు? కొందరు ఇవన్నీ చేస్తోంది ముకేశ్ అంబానీ అంటున్నారు. అది వాస్తవమా? కాదా? మీరూ, రాహుల్ గాంధీ ప్రైవేటు హెలికాప్టర్లు ఉపయోగిస్తున్నారు. ఆ చాపర్లు ఎవరివి? మీకు ఉచితంగా ఎందుకిస్తున్నారు? లేక, మీరు రుసుం చెల్లిస్తున్నారా? వీటన్నింటికి జవాబివ్వాలి' అని కేజ్రివాల్ తన లేఖలో డిమాండ్ చేశారు. కాగా, ఇదే విషయమై రాహుల్ గాంధీకి కూడా లేఖ రాస్తానని ఈ మాజీ సీఎం చెప్పారు.