: కిరణ్ పార్టీతో వైకాపాకు నష్టం: సబ్బం హరి
ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కిరణ్ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి స్పష్టం చేశారు. ఇరు ప్రాంతాల ప్రజలందరూ రాష్ట్ర విభజనపై ఉత్కంఠగా ఉండటంతో, కిరణ్ రాజీనామా పెద్దగా హైలైట్ కాలేదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలను సమైక్యంగా ఉంచేందుకు కిరణ్, లగడపాటి, కేవీపీలు చాలా కృషి చేశారన్న విషయం ప్రజలందరికీ తెలుసని తెలిపారు. ప్రస్తుతం సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ శూన్యత ఉందని అన్నారు. టీడీపీ, బీజేపీ కలిసుంటే వారికి రానున్న ఎన్నికల్లో మెజారిటీ లభించేదని అన్నారు.
సమైక్యం కోసం ఏ నాయకుడు నిజంగా పోరాడాడనే విషయంలో సీమాంధ్ర ప్రజలకు పూర్తి స్పష్టత ఉందని సబ్బం హరి తెలిపారు. సమైక్యత (కిరణ్), విభజనకు సహకారం (జగన్), సమన్యాయం (చంద్రబాబు) విషయాల్లో దేనికి ఓటు వేయాలనే విషయంపై ప్రజలు తేల్చుకుంటారని... వారం రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు. కిరణ్ పార్టీతో వైఎస్సార్సీపీకి కచ్చితంగా నష్టం జరుగుతుందని... కాకపోతే ఈ విషయంపై ఓ అంచనాకు ఇప్పడే రాలేమని చెప్పారు. లగడపాటి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా, రాజకీయాలలో మాత్రం ఉంటారని తెలిపారు.