: పెద్దమ్మ, చిన్నమ్మలు ఫెడరల్ వ్యవస్థను నాశనం చేశారు: మోదుగుల
అంతా జరిగిపోయిన తర్వాత ఇక మాట్లాడటానికి ఏముందని టీడీపీ ఎంపీ మోదుగుల ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమ్మ, చిన్నమ్మ ఇద్దరూ ఫెడరల్ వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఏకపక్షంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. ప్రత్యక్ష ప్రసారాలు కూడా కట్ చేసి సభను నడిపించడం, డివిజన్ లేకపోవడం, సభ్యులను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టించే అంశాలని అన్నారు. తెలంగాణ బిల్లు ఓ కళంకిత బిల్లు అని ఆరోపించారు. ఓటింగ్ జరపకుండా, మూజువాణితో మమ అనిపించడం బాధాకరమని చెప్పారు. ఈ రోజు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిన్న రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్ కురియన్ వ్యవహరించిన తీరుతో... చట్టసభల్లో ఇంకా కొంతైనా ప్రజాస్వామ్యం బతికే ఉందని అనిపిస్తోందని తెలిపారు. టీడీపీకి చెందిన సభ్యులం మనసా వాచా సమైక్య రాష్ట్రం కోసం పోరాడామని... సీమాంధ్ర ప్రజల్లో టీడీపీకి మంచి నమ్మకం ఉందని చెప్పారు.