: దొంగతనానికి వచ్చి బీరుకు లొంగిపోయాడు


దొంగతనానికి వస్తే.. చడీ చప్పుడు కాకుండా పని చేసుకుపోవాలి కదా.. కానీ, ఆ దొంగ బలహీనతకు లొంగిపోయాడు. ఆనక దొరికిపోయాడు. అమెరికాలోని ఫ్లోరిడాలో మౌంట్ డోరా ప్రాంతం. సోమవారం రాత్రి ఒక ఇంట్లోకి దొంగ చొరబడ్డాడు. హాల్లోకి ప్రవేశించాడు. ఇంటి యజమానురాలు బెడ్ రూమ్ లో గాఢ నిద్రలో ఉంది. దొంగకు రిఫ్రిజిరేటర్ కనిపించింది. అందులో లైటింగ్ వెలుగులో బీరు సీసా కనిపించేసరికి దొంగ నాలుక పీకింది. కాళ్లు గుంజాయి. తాను వచ్చింది తాగడానికి కాదు అన్నది కూడా దొంగకు గుర్తుకు రాలేదు. మాంచి హుషారుగా బీరు పట్టించేశాడు. ఇంకేముంది నిద్ర తన్నుకొచ్చింది. వెళ్లి యజమానురాలి బెడ్ పైనే ఓ పక్కన దుప్పటి కప్పుకుని హాయిగా నిద్రపోయాడు.

ఆ ఇంటి మహిళ పొద్దున్నే నిద్ర లేచి ఆ మత్తులోనే వెళ్లి కిచెన్ లో కాఫీ పెట్టుకుంటోంది. ఇంతలో తన బెడ్ రూమ్ లోంచి గురక చప్పుడు వినిపించింది. నిదానంగా వెళ్లి చూస్తే మంచంపై దుప్పటి కప్పుకుని పడుకున్న మనిషి. భయపడిపోయింది. ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి చూస్తే అతడెవరో తెలియదు. దొంగ అని అర్థం చేసుకున్న ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. వారొచ్చి దొంగకు నిద్ర మత్తు వదిలించి తమ వెంట తీసుకెళ్లారు. ఇటీవల ఆ ప్రాంతంలో జరిగిన దోపిడీలన్నింటినీ అతడి ఖాతాలో వేసేశారు.

  • Loading...

More Telugu News