: విభజనను వ్యతిరేకిస్తున్నాం: రాజ్యసభలో సీపీఎం నేత ఏచూరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నామని సీపీఎం నేత సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. రాజ్యసభలో టీబిల్లుపై చర్చ వాడివేడిగా సాగుతున్నా సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి తాను కూడా బాధ్యుడినే అని చెప్పారు. ఉద్యమాలు, త్యాగాల ఫలితంగానే భాషాప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయిని చెప్పారు. తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని తెలిపారు. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ సూక్తిని సభలో ప్రస్తావించారు. విభజన వల్ల దేశంలో అనేక సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. ప్రత్యేకాంధ్రం ఉద్యమం వల్ల తాను రెండేళ్ల చదువు కోల్పోయానని చెప్పారు. విభజన విషయంలో సీపీఎం వైఖరి మారిందన్న వెంకయ్యనాయుడి వ్యాఖ్యలు అవాస్తవమని చెప్పారు. దీనికి తోడు రాష్ట్ర విభజనకు అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయన్న వెంకయ్య మాటలను కూడా ఆయన ఖండించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని ఆరోపించారు.