: రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లును పాస్ చేయండి: టీఆర్ఎస్ నేత వినోద్
లోక్ సభలో ఆమోదం పొంది తెలంగాణ ముసాయిదా బిల్లు రాజ్యసభకు వచ్చిన విషయం విదితమే. రాజ్యసభలో ఈ బిల్లు రేపు చర్చకు రానుంది. దీనికి సంబంధించి టీఆర్ఎస్ నేత వినోద్ మీడియాతో మాట్లాడారు. రాజ్యసభలో బిల్లుపై కొన్ని సవరణలు చేయాలని భారతీయ జనతాపార్టీ ప్రతిపాదిస్తోందని ఆయన చెప్పారు. కానీ, లోక్ సభలో కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మద్దతుతోనే బిల్లు ఆమోదం పొందిందని, అలాంటప్పుడు బిల్లుకు పెద్దల సభలో సవరణలు చేయాల్సిన అవసరమేముందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రతిపాదిస్తోన్న సవరణలను అగ్రనేతలైన అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ప్రధాని మన్మోహన్ నుంచి హామీ పొందితే సరిపోతుందని, దానిపై రాజ్యసభలో చర్చ జరిగాల్సిన అవసరం లేదని వినోద్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముసాయిదా బిల్లు రాజ్యసభలో కూడా పాస్ అయ్యేలా చూడాలని ఆయన బీజేపీ అగ్రనేతలను కోరారు.