: కాంగ్రెస్ కు 60, బీజేపీకు 150: ఇవి మమతా బెనర్జీ లెక్కలు
త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని సీట్లు గెలుచుకుంటాయో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అదినేత్రి మమతా బెనర్జీ ఊహిస్తున్నారు. కాంగ్రెస్ 60 సీట్లతో సరిపెట్టుకుంటే, బీజేపీ 150 స్థానాలతో గట్టెక్కుతుందని తాననుకుంటున్నట్లు చెప్పారు. ఓ ఆంగ్ల చానల్ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన మమతా, రాష్ట్రం కోసం పనిచేసేందుకు ఇదే సరైన సమయమని, అదే సమయంలో కేంద్రంలోనూ పని చేయాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో బెంగాల్ లో 42 లోక్ సభ స్థానాలతో బాటు, వివిధ రాష్ట్రాల్లో కూడా తృణమూల్ పోటీ చేస్తుందన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు మమత నిర్మొహమాటంగా తిరస్కరించారు. కాగా, యూపీఏ, ఎన్ డీఏ కాకుండా తదుపరి ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే, తన పరిమితులేంటో తనకు తెలుసునని, తనకు ఎలాంటి పదవిపై ఆశ లేదని మమత స్పష్టం చేశారు. నేను, మీరు కాకుండా ప్రజాస్వామ్యమే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తుందని, అంతా సీట్లు దక్కించుకునే సంఖ్యపైనే ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.