: చిదంబరానికి మోడీ కౌంటర్
తనపై ఆర్థిక మంత్రి చిదంబరం చేస్తున్న విమర్శలకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దీటుగా బదులిచ్చారు. తన ఉపన్యాసాలపైనా పన్నులు విధించి దేశ ఆదాయాన్ని పెంపొందించే పనిలో చిదంబరం నిమగ్నమైనట్టు తెలుస్తోందని ఎద్దేవా చేశారు. చిదంబరం గతరాత్రి మోడీపై వ్యాఖ్యానిస్తూ.. మోడీ ఆర్థిక పరిజ్ఞానం ఎంతో ఓ పోస్టల్ స్టాంపు వెనుక రాయొచ్చని విమర్శించారు. దీనికి బదులుగా, మోడీ తాజా వ్యాఖ్యలు చేశారు. 'నా ఉపన్యాసాలపై సేవా పన్ను విధించేందుకు ఆర్థిక మంత్రి తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్టు నాకు నిన్న సాయంత్రమే తెలిసింది. నా ఉపన్యాసాలు కూడా దేశ సేవలో పాలుపంచుకుంటున్నాయని తెలిసి ఎంతో సంతోషిస్తున్నా' అని మోడీ పేర్కొన్నారు.
గాంధీనగర్లో నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలంగా మోడీ, చిదంబరం మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బడ్జెట్ పై మోడీ స్పందనకు బదులుగా 8వ తరగతి విద్యార్థితో తాను వాదించనని చిదంబరం వ్యాఖ్యానించారు.