: 'కూల్' కు 'వాల్' సలహా
దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ సిరీస్ లలో ఘోర పరాజయాలు మూటగట్టుకున్న ధోనీ సేనపై భారత్ లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కెప్టెన్ ధోనీని విమర్శకులు టార్గెట్ చేశారు. టెస్టు కెప్టెన్సీ నుంచి ధోనీని తప్పించాలంటూ తమ వ్యాసాల్లో తీవ్ర పదజాలంతో పేర్కొన్నారు. కానీ, మిస్టర్ కూల్ కు ద్రావిడ్ మద్దతుగా నిలిచాడు. ఓ రకంగా ధోనీకి టీమిండియా పగ్గాలు చేజిక్కడానికి 'మిస్టర్ వాల్' సిఫార్సే కారణం. తాను తప్పుకుంటూ కెప్టెన్ గా ధోనీ పేరును సూచించాడు ఈ కర్ణాటక దిగ్గజం. తన వారసుడు ఇప్పుడిలా డీలా పడిపోవడం ద్రావిడ్ కు నచ్చడంలేదు. విదేశీ గడ్డపై టెస్టులు గెలవాలంటే కొన్ని రిస్కులు తీసుకోక తప్పదని ధోనీకి సలహా ఇచ్చాడు.
పైకి చెబుతున్నంతగా ధోనీ తన బౌలర్లపై నమ్మకం ఉంచుతున్నట్టు కనిపించడం లేదని చెప్పాడు. మ్యాచ్ మధ్యలో కొత్త బంతి తీసుకునే విషయంలో ధోనీ అయోమయానికి గురవుతున్నట్టుందని అభిప్రాయపడ్డాడు. పాతబంతితో బౌలింగ్ చేసి పరుగులు నియంత్రించడంపైనే దృష్టి పెడుతున్నాడని విమర్శించాడు. అలాంటి రక్షణాత్మక ధోరణి కంటే దూకుడు నిర్ణయాలు తీసుకుంటేనే టెస్టుల్లో విజయలక్ష్మి వరిస్తుందని ధోనీకి సూచించాడు.