: అందాల ద్రాక్ష
ద్రాక్ష పళ్లు ఆరోగ్యానికి, అందానికి బాగా పనిచేస్తాయని నేషనల్ స్కిన్ సెంటర్ డైరెక్టర్ నవీన్ తనేజా చెబుతున్నారు. సాధారణ చర్మం కలిగిన వారిలో మొటిమలను తగ్గించడానికి ద్రాక్ష పళ్లు చక్కగా పనిచేస్తాయట. పండ్లలోని గింజలు రక్తనాళాలలను బలోపేతం చేసి, చర్మ ఆరోగ్యాన్ని అందిస్తాయంటున్నారు. ఇక ద్రాక్షపళ్లను గుజ్జు చేసి ముఖంపై మాస్కులా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడుక్కుంటే చర్మంలో ఉన్న మృతకణాలు తొలగిపోతాయట. జిడ్డు చర్మం ఉన్న వారైతే నల్లటి ద్రాక్ష పళ్ల గుజ్జులో ముల్తానీ మట్టి కాస్త, రోజ్ వాటర్ కాస్త కలిపి ప్యాక్ లా వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలని సూచిస్తున్నారు. పొడి చర్మం ఉన్నవారు నల్ల ద్రాక్ష పళ్ల గుజ్జులో అవొకాడో గుజ్జు, రెండు స్పూన్ల తేనె, రోజ్ వాటర్ కలిపి ముఖం పై ప్యాక్ వేసుకోవచ్చని నవీన్ తనేజా తెలిపారు.