: బెంగళూరులో 'అమ్మ' క్యాంటీన్
తమిళనాడు సీఎం జయలలిత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన బడ్జెట్ క్యాంటీన్లు చెన్నయ్ లో విజయవంతమైన సంగతి తెలిసిందే. రూపాయికే ఇడ్లీ, ఐదు రూపాయిలకే భోజనం, చవక ధరకే మినరల్ వాటర్ వంటి పథకాలు జయలలితకు విశేషంగా పేరు తెచ్చిపెట్టాయి. కొద్దిరోజుల క్రితం 'అమ్మ' జయలలిత జన్మదినాన్ని పురస్కరించుకుని బెంగళూరులోనూ 'అమ్మ' స్ఫూర్తిగా ఓ బడ్జెట్ క్యాంటీన్ ను ప్రారంభించారు. స్థానిక ఏఐఏడీఎంకే నేత కేఆర్ కృష్ణరాజు ఈ క్యాంటీన్ నెలకొల్పారు. తమిళనాడులో మాదిరే ఇక్కడా అదే ధరలకు ఆహార పదార్ధాలు అందిస్తామని ఆయన చెప్పారు. కర్ణాటక ఏఐఏడీఎంకే మాజీ కార్యదర్శి అయిన కృష్ణరాజు ప్రతి ఏడాది జయ జన్మదినం సందర్భంగా ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం రివాజుగా వస్తోంది. కాగా, ఇలాంటివే మరి కొన్ని క్యాంటీన్లు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని భావిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, కృష్ణరాజు బాటలో మరికొందరు జయ అభిమానులు గార్డెన్ సిటీలో బడ్జెట్ క్యాంటీన్లు తెరిచేందుకు ఉత్సాహం చూపుతున్నారట.