: లంకనూ దార్లోకి తెచ్చుకున్నారు!
బలవంతుడిదే రాజ్యమని ఊరికే అనలేదు! బీసీసీఐ ఆ విషయాన్ని రుజువు చేసింది కూడా. నిన్నమొన్నటి వరకు ఐసీసీలో సమూల మార్పుల ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించిన శ్రీలంక క్రికెట్ బోర్డు నేడు 'జీ హుజూర్' అంటోంది. ఐసీసీ పునర్వ్యవస్థీకరణ ద్వారా ప్రపంచ క్రికెట్ ఆదాయంలో సింహభాగం బీసీసీఐకే చెందుతుంది. తొలుత దీనికి పాకిస్తాన్, శ్రీలంక, దక్షిణాఫ్రికా బోర్డులు అంగీకరించలేదు. కానీ, సింగపూర్లో జరిగిన ఐసీసీ కార్యవర్గ సమావేశంలో దక్షిణాఫ్రికా వెనక్కి తగ్గింది. లంక, పాక్ లు తీర్మానానికి అడ్డుచెప్పినా, మిగతా ఎనిమిది సభ్య దేశాల అండతో బీసీసీఐ పంతం నెగ్గించుకుంది. ఇది జరిగిన కొద్ది రోజులకే శ్రీలంక కూడా బీసీసీఐ బాటలోకే వచ్చింది.
కొలంబోలో జరిగిన లంక క్రికెట్ బోర్డు కార్యవర్గ సమావేశంలో ఐసీసీలో మార్పులకు సమ్మతించాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. పాకిస్తాన్ మాత్రం తమను బీసీసీఐ బెదిరించిందని ఆరోపిస్తోంది. నేడో రేపో దాయాది కూడా బీసీసీఐ బాటలోకి రాకతప్పదేమో!